Yadadri Daily Schedule: యాదాద్రి లక్ష్మీనారసింహుడి మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రధానాలయంలో భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రధాన ఆలయ దర్శన సమయాలు, పూజల వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం 3 గంటలకు ఆలయం తెరుచుకోనుండగా.... మూడున్నర వరకు స్వామివారికి సుప్రభాతం జరగనుంది. మూడున్నర నుంచి 4 గంటల వరకు బందే తీర్థం, ఆరాధన కార్యక్రమాలు, ఉదయం 4 గంటల నుంచి నాలుగున్నర వరకు స్వామివారికి బాలభోగం నిర్వహిస్తారు. నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు నిజాభిషేకం, ఐదున్నర నుంచి 5 గంటల 45నిమిషాల వరకు స్వామివారికి అలంకరణ చేస్తారు. 5గంటల 45 నిమిషాల నుంచి ఆరున్నర వరకు లక్ష్మీనారసింహుడికి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన.... ఆరున్నర నుంచి 8గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. 8గంటల నుంచి 9గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనానికి అవకాశమివ్వనున్నారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు సర్వదర్శనాలు, మధ్యాహ్నం 12 నుంచి 12గంటల 45 నిమిషాల వరకు స్వామివారికి మధ్యాహ్న రాజభోగం నిర్వహిస్తారు.
Yadadri Puja Schedule : మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనానికి అవకాశముంటుంది. సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు సర్వదర్శనాలుంటాయి. రాత్రి 7గంటల నుంచి ఏడున్నర వరకు తిరువారాదన, ఏడున్నర నుంచి 8గంటల 15 నిమిషాల వరకు స్వామివారికి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన ఉంటుంది. రాత్రి 8గంటల 15 నిమిషాల నుంచి 9గంటల 15 నిమిషాల వరకు సర్వదర్శనాలు, రాత్రి 9గంటల 15 నిమిషాల నుంచి 9గంటల 45 నిమిషాల వరకు రాత్రి నివేదన జరుపుతారు. 9గంటల 45 గంటల నుంచి 10గంటల వరకు శయనోత్సవం అనంతరం ద్వారబంధనం ఉంటుంది.
Yadadri Temple News : సర్వదర్శన వేళలో ఉదయం ఆరున్నర నుంచి రాత్రి 9గంటల 15 నిమిషాల వరకు సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం నిర్వహిస్తారు. ఉదయం ఎనిమిదన్నర నుంచి 10గంటల వరకు శ్రీ సుదర్శన నారసింహ హోమం, ఉదయం పదిన్నర నుంచి 12గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం ఉంటుంది. సాయంత్రం 5గంటల నుంచి ఆరున్నర వరకు స్వామివారి వెండిమొక్కు జోడు సేవలు, సాయంత్రం 6గంటల 45 నిమిషాల నుంచి 7గంటల వరకు దర్బార్ సేవ నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం ఉదయం ఎనిమిదన్నర నుంచి 11గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ, ప్రతి శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు శ్రీ ఆండాళమ్మవారి ఉత్సవ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: Yadadri: యాదాద్రిలో ఐదోరోజు వైభవంగా పంచకుండాత్మక మహాయాగం