యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలోని బల్క్ డ్రగ్స్ తయారు చేసే బృందావన్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసే రసాయన వ్యర్థాలతో ఇక్కడి వ్యవసాయ భూములు నిరుపయోగమవుతున్నాయి. ఈ పరిశ్రమ వల్ల మూడెకరాల్లో ఉన్న సుబాబుల్ మొక్కలు మోడువారిపోయాయి. సర్వే నం.248, 249, 250, 292, 293ల్లో ఉన్న భూముల్లో కూరగాయలు, పండ్ల తోటలు వేసుకోలేని పరిస్థితి. వాయు కాలుష్యం వల్ల వచ్చే దుర్వాసనను తట్టుకోలేక ఇక్కడ వ్యవసాయం చేసేందుకు కూలీలు ఎవరూ ముందుకురావడంలేదని రైతులు చెబుతున్నారు. ఈ పరిశ్రమకు కిలోమీటరు దూరంలో ఉన్న పొలంలో కూరగాయలు పండించి ఎకరాకు రూ.2.5 లక్షలు ఆర్జిస్తున్నారు. ఇటీవల ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టని పక్షంలో భూములన్నీ బీళ్లుగా మారే ప్రమాదం ఉంది.
2005 నుంచి సమస్య
2005 నుంచి ఈ ఫ్యాక్టరీ కాలుష్యాన్ని వెదజల్లుతున్నా కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు పట్టించుకోలేదు. 2019లో రైతుల ఫిర్యాదుతో మూసివేత ఉత్తర్వులు జారీ చేసిన పీసీబీ..రైతులకు ఎకరానికి రూ.3,500 చొప్పున పరిహారం చెల్లించాలన్న షరతుతో తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది. 5.11 హెక్టార్లలో 26.5 టీఏపీ సామర్థ్యంతో నడుస్తున్న ఫ్యాక్టరీకి 2016లో 1,020 టీపీఏ విస్తరణకు కేంద్ర పర్యావరణశాఖ అనుమతులిచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులంతా వ్యతిరేకించినా అధికారులు పట్టించుకోలేదు. కాలుష్య నియంత్రణ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రతి ఆరునెలలకోసారి కేంద్రానికి నివేదిక సమర్పించాల్సి ఉండగా 2017లో ఒక్కసారి మాత్రమే ఇచ్చారు.
నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశం
బృందావన్ లేబొరేటరీస్ కాలుష్య నివారణకు పీసీబీ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఇటీవల రైతు నరేందర్‌రెడ్డి చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించారు. దీనిపై ఎన్జీటీ జ్యుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, సాంకేతిక సభ్యులు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక సమర్పించాలని పీసీబీ, యాదాద్రి కలెక్టర్, వ్యవసాయశాఖ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1న ఈ పిటిషన్ విచారణకు రాగా వెంటనే ప్రైవేటు కంపెనీ కాలుష్య నీరు నిల్వ లేకుండా తరలించి అక్కడ ఎలాంటి కాలుష్యం లేదని చెప్పే ప్రయత్నాలు ప్రారంభించడం విశేషం.