కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. కరోనా ముసుగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నాయని ఆరోపించారు.
విద్యుత్ బిల్లుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పెంచిన వేతనాల్లో.. ఏడాదికి రెండు వందల పని దినాలు విధిగా కల్పించాలని కోరారు. ఆరు నెలల పాటు బీపీఎల్ కుటుంబాలకు నెలకు 7500 రూపాయల చొప్పున నగదు, ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా కష్టకాలంలో ఉద్యోగం లేని వారికి రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగ భృతి కల్పించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోన్న తరుణంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు.