కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పలు గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛంద లాక్డౌన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో వైరస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడం వల్ల వ్యాపారులు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. యాదగిరిగుట్టలో అత్యవసర సేవలు తప్ప మిగతా దుకాణాలన్నీ మూసివేయాలని పురపాలక సంఘం తీర్మానించింది. రాత్రి కర్ఫ్యూ కొనసాగుతున్న కారణంగా యాదాద్రి ఆలయాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సేవలు కొనసాగుతున్నాయి.
రహదారులు నిర్మానుష్యం
యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం కరోనా నిర్ధరణ పరీక్షలు జరపగా పట్టణంలో 14, మోటకొండూర్ 6, తుర్కపల్లి 14, రాజాపేట 7, ఆలేరు 31, బొమ్మలరామారం 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల నుంచి పట్టణంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
భార్యాభర్తలు బలి
యాదగిరిగుట్టలో వైరస్ బారినపడి దంపతులు మృతి చెందారు. పట్టణానికి చెందిన దంపతులు ఇటీవల కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న తరుణంలో భర్త (72 )అస్వస్థతకు గురి అయ్యారని పీహెచ్సీ సిబ్బంది తెలిపారు. చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా... మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు వెల్లడించారు. భర్త మృతి చెందిన విషయం తెలిసిన ఆ భార్య గుండెపోటుతో మరణించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: అబ్బాయి మెడలో తాళి.. విచిత్రంగా ఉంది కదూ!