యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొండపైన నిర్మితమవుతున్న శివాలయం పనులు తుదిదశకు చేరినందున.. లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా నిర్మించాలనుకున్న సీఎం ఉద్దేశాన్ని నెరవేర్చాలని, అందుకు యాడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరారు.
కొండపైన విష్ణు పుష్కరిణి, ల్యాండ్ స్కెప్ పనులు, ఘాట్ రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్న గ్రీనరిని పరిశీలించి.. పలు సూచనలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంమంతా అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం హరిత టూరిజంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తన యాదాద్రి పర్యటనపై పూర్తి నివేదికను సీఎంకు అందజేయనున్నట్లు తెలిపారు.