యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి సీఎం కేసీఆర్ ఈనెల 22వ తేదీన వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా కేసీఆరే... వాసాలమర్రి సర్పంచ్‌కు ఫోన్ చేశారు. ఈనెల 22వ తేదీన గ్రామంలో పర్యటిస్తున్నట్లు సర్పంచ్‌కు తెలిపారు. గ్రామస్థులతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటానని తెలిపిన సీఎం.. వారితో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొంటానని వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. వాసాలమర్రిని కేసీఆర్ దత్తత తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే సునీత.. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.
నివేదిక తయారు..
తాను దత్తత తీసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖలు ఆ గ్రామాన్ని సందర్శించాయి. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సైతం రూపొందించాయి. సీఎం ఆదేశాలతో అప్పటి కలెక్టర్ అనితారామచంద్రన్... గత నెలలోనే సమగ్ర సర్వే పూర్తి చేయించారు. వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించేందుకు... జిల్లా యంత్రాంగం గడప గడపకు వెళ్లి వివరాలు సేకరించింది. రాష్ట్రస్థాయి అధికారులు కూడా గ్రామంలో పర్యటించి లోటుపాట్లు లేని రీతిలో నివేదికను తయారు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి దత్తత హామీతో ఇంతకాలం వలస బాటి పట్టిన స్థానికులు... గ్రామంలోనే కాలం గడుపుతున్నారు. హైదరాబాద్‌కు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసాలమర్రి... సీఎం ఆదేశాలతో ఇప్పటికైనా అభివృద్ధి దిశగా పయనిస్తుందని గ్రామస్థులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: CJI Justice NV Ramana: శ్రీశైలం సందర్శనలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ