గత జూన్ 22న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం మరోమారు గ్రామానికి రాబోతున్నారు. దత్తత తీసుకున్న పల్లెకు ఉదయం పదకొండున్నరకు చేరుకోనున్న ఆయన.. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా తొలుత దళితవాడల్లో పాదయాత్ర చేస్తారు. ప్రజలతో మాట్లాడిన అనంతరం సర్పంచి పోగుల ఆంజనేయులు నివాసంలో భోజనం ముగించుకుని.. రైతు వేదిక వద్ద నిర్మించిన సభకు హాజరవుతారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులంతా.. వాసాలమర్రి వసతులపై దృష్టిసారించారు. రైతు వేదిక భవనంలో సభ కోసం.. ఉదయం నుంచి ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పరిమితంగా ఎంపిక చేసిన గ్రామస్థులను మాత్రమే.. కేసీఆర్ సభకు హాజరయ్యేలా చూస్తున్నారు. కేవలం 120 నుంచి 150 మంది కూర్చునేందుకే వసతులున్నాయి. గ్రామ పంచాయతీ కార్మికులతోపాటు భువనగిరి పురపాలిక సిబ్బంది.. గ్రామాన్ని సుందరంగా మార్చారు.
రెండోసారి వాసాలమర్రికి సీఎం
నెల రోజుల్లోపు వాసాలమర్రికి వస్తానంటూ ముఖ్యమంత్రి.. గత సందర్శన సమయంలో స్పష్టం చేశారు. అందుకనుగుణంగా జులై 10న సీఎం వస్తారని ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ఇప్పుడు కేసీఆర్ రెండోసారి రానుండటంతో.. పల్లెలో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అక్కడ పర్యటించిన అధికారుల బృందాలు.. ప్రజల వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించాయి. ఏడు కమిటీలైన పారిశుద్ధ్యం-తాగునీరు, ఆరోగ్యం, శ్రమదానం, హరితహారం, మౌలిక వసతులు, వ్యవసాయం, మార్కెటింగ్ తోపాటు.. గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. వాసాలమర్రిలో ఇప్పటికే శ్రమదానం ప్రారంభించగా.. విద్యుత్తు ఆదా కోసం ప్రత్యేకంగా వీధి దీపాలకు ఆటోమేటిక్ కంట్రోల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రధానమైన గ్రామాభివృద్ధి కమిటీలో 25 మంది, అనుబంధ కమిటీలో 15 మంది చొప్పున ఉండేలా.. గ్రామస్థులందరి సమక్షంలో సభ్యులను ఎన్నుకున్నారు. ప్రతి కమిటీలోనూ అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీఎం పర్యటన దృష్ట్యా వాసాలమర్రిలో.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దత్తతగ్రామాన్ని మరో అంకాపూర్, గంగదేవిపల్లిగా మార్చుతానని ప్రకటించిన సీఎం.. గతేడాది నవంబరు 17న ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో వాసాలమర్రి వాసులను అంకాపూర్ పర్యటనకు పంపారు. అక్కడి ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిశీలించడం ద్వారా.. తాము ఎలా ముందుకు సాగాలన్న దానిపై ఒక అవగాహనకు వచ్చేలా పర్యటన రూపొందించి అమలు చేశారు. గత సభలో ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ మరోసారి రానుండటంతో.. గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇదీ చూడండి: