యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి కొత్త శోభను సంతరించుకుంది. దత్తత గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో... పల్లె అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. యుద్ధప్రాతిపదికన చేపట్టిన పనులతో... సందడి నెలకొంది. ఓ చోట సభావేదిక...... మరోచోట సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లు చేశారు. వర్షానికి తట్టుకునేలా ప్రత్యేకంగా షెడ్డులను నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని చదును చేశారు. గ్రామస్థులందరూ పాల్గొనేలా ఇంటింటికీ పాసులు జారీ చేస్తున్నారు. కేవలం వాసాలమర్రి వాసులే హాజరయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
భువనగరి-గజ్వేల్ జాతీయ రహదారిపై ఉన్న వాసాలమర్రిలో... 2వేల మందికిపైగా జనాభా ఉంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామాన్ని.... 7నెలల క్రితం సీఎం కేసీఆర్ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గ్రామానికి వస్తున్నట్లు స్వయంగా అక్కడి సర్పంచ్‌కి ముఖ్యమంత్రి ఫోన్ చేశారు. గ్రామస్థులు ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూస్తున్నారు. వాసాలమర్రి చరిత్రలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందని... మంత్రి జగదీశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనకు చేసిన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి... అభివృద్ధిలో ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వాసాలమర్రి చేరుకోనున్న ముఖ్యమంత్రి... గ్రామ సభలో పాల్గొంటారు. అనంతరం స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. మొత్తం 5 వేల మంది కోసం... 20 రకాలకు పైగా వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చదవండి: KTR: ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారి నీరు విడుదల : కేటీఆర్