TRS operation Akarsh fear in BJP: రాష్ట్రంలోని కమలనాథులు ఆపరేషన్ ఆకర్ష్‌తో తెరాస, కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతల్ని భాజపాలో చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాననే సంకేతాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్న భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు మునుగోడు ఉపఎన్నిక టికెట్ ఇవ్వకుండా తెరాస నిరాకరించడంతో ఆయన భాజపాలో చేరారు. ఈ క్రమంలో మునుగోడులో బలమైన బీసీ నేత, గౌడ సామాజిక వర్గానికి చెందిన బూరనర్సయ్య గౌడ్‌ను పార్టీలో చేర్చుకోవడంలో కాషాయదళం సఫలీకృతమైంది.
అప్రమత్తమైన భాజపా: బూర భాజపాలో చేరడం తెరాసకు తీవ్ర నష్టం కలగజేస్తోందని రాజకీయ వర్గాలు భావించాయి. భాజపా దూకుడుకు చెక్ పెడుతూ గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. బూర నర్సయ్య గౌడ్ భాజపాలో చేరిన మరుసటి రోజే అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను తెరాసలో చేర్చుకుని గట్టి షాక్ ఇచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ భాజపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి గులాబీ గూటికి చేరారు. జితేందర్‌రెడ్డి, తూళ్ల వీరేందర్‌గౌడ్, కూన శ్రీశైలంగౌడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా భాజపాను వీడుతారని ప్రచారం జరగడంతో భాజపా రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. ఇంకా ఎవరెవరు పార్టీని వీడుతారనే దానిపై ఆరా తీసే పనిలో పడింది. మరోవైపు తాము పార్టీ వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి ఖండించారు.
మునుగోడు గెలుపుపై ప్రభావం తప్పదా: స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, భిక్షమయ్య గౌడ్ భాజపాను వీడడం పార్టీ బలోపేతంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదముందని కాషాయదళం భావిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల వేళ తాజా పరిణామాలు రాజగోపాల్ గెలుపుపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదని యోచిస్తోంది. పార్టీని మరెవరూ వీడకుండా తెరాసను దెబ్బతీసేలా భాజపా నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది.
ఇవీ చదవండి: