తన వాహనానికి అనవసరంగా చలానా((challan) వేశారంటూ ఓ యువకుడు రోడ్డుపై హల్చల్ చేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగింది. లాక్డౌన్ మినహాయింపు సమయం(Lockdown Exception Time) ముగియగానే.. రోడ్లపై వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ-పాస్(e-pass) అనుమతి పత్రాలు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్(Hyderabad)కి చెందిన నరేశ్ ద్విచక్రవాహనంపై పట్టణానికి వచ్చాడు. మినహాయింపు సమయం 5 నిమిషాలు దాటి వచ్చినందుకు గానూ... సదరు యువకునికి పోలీసులు రూ.1000 చలానా వేశారు.
తాను ఆఫీసు పని నిమిత్తం వెళ్తున్నానని... కేవలం ఐదు నిమిషాలు ఆలస్యమైనందుకు వెయ్యి రూపాయలు జరిమానా ఎలా విధిస్తారంటూ రోడ్డుపై నానా హంగామా చేశాడు. పోలీసులు చెప్పినా... వారించినా... వినకుండా సోషల్మీడియా(social media)లో తన బాధను పోస్ట్ చేయడానికి ప్రయత్నించాడు. రోడ్డుపై న్యూసెన్స్ సృష్టించవద్దని ఆ వాహనదారున్ని పోలీసులు హెచ్చరించినా... వినిపించుకోకుండా నిరసన వ్యక్తం చేశారు. తనకు విధించిన వెయ్యి రూపాయల జరిమానాను తొలగించాలని పోలీసులతో వాదనకు దిగాడు.
ఎంత చెప్పినా వినకపోవటం వల్ల పోలీసులు అతన్ని స్టేషన్కి తరలించారు. లాక్డౌన్ నిభందనలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని పట్టణ పోలీసులు యువకులను హెచ్చరించారు.