ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అధిక శాతం జనాభా ఉన్న బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని కుమ్మరి సత్రంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు గుండు జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
బీసీ పట్టభద్రులు ఆలోచించి చెరుకు సుధాకర్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు అండగా నిలవాలన్నారు. ఈ ఎన్నికలే రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని వెల్లడించారు. అధికార పార్టీ నాయకులు, మంత్రులు పట్టభద్రులను బెదిరించడాన్ని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఖండించారు.