Bandi Sanjay Clarity on Komatireddy Issue : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా నియోజకవర్గంలోని భట్టుపల్లి గ్రామానికి చేరుకున్న బండి సంజయ్‌కి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భట్టుగూడెం వద్ద మూసీ నది లోలెవల్ బ్రిడ్జి, పక్కనే ఉన్న పంట పొలాలను బండి పరిశీలించారు. పలువురు గ్రామస్థులు తమ సమస్యలను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. భాజపా ప్రభుత్వం వచ్చాక అందరి సమస్యలను పరిష్కరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని భట్టుగూడెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు.
ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి ప్రధాని మోదీ.. అనంతరం పాదయాత్ర శిబిరం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో బండి సంజయ్ మాట్లాడారు. ‘‘ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాతో టచ్‌లో ఉన్నారని నేను అనలేదు. అనని మాటను అన్నట్టు బ్రేకింగ్స్ పెట్టొద్దని మీడియాకు నా విజ్ఞప్తి. ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి ప్రధాని మోదీ. అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోదీని కలుస్తూ ఉంటారు’’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది భాజపానే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. దుబ్బాక, నాగార్జుసాగర్, హుజూరాబాద్ ఉపఎన్నికల సమయాల్లో ఆరు నెలల చొప్పున కేసీఆర్ టైంపాస్ చేశారని.. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక పేరుతో మళ్లీ ఆరు నెలలు టైంపాస్ చేస్తారని వ్యాఖ్యానించారు.