Drum Seeder in Yadadri : యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన రేగు మల్లేశ్ అనే యువరైతు పాత వస్తువులతో డ్రమ్ సీడర్ తయారు చేశారు. తనకున్న నాలుగు ఎకరాల్లో ఏటా వరినాటు వేసే సమయంలో కూలీల కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించాలని నిర్ణయించుకుని ఇంటి వద్ద ఉన్న పాత వస్తువులో డ్రమ్ సీడర్ పరికరాన్ని తయారు చేశారు.
ఒక్కరోజులోనే తయారీ..
Drum Seeder in Aler : ఆరు అడుగుల పొడవు, ఆరు ఇంచుల వెడల్పు గల ప్లాస్టిక్ పైపు కొనుగోలు చేశారు. రెండు సైకిల్ పాత రీములు, రెండు సీలింగ్ ఫ్యాను కప్పులు తీసుకున్నారు. అవసరమైన నట్లు, ఇనుప పట్టీలు సమకూర్చుకొని ఒక్క రోజులోనే స్వయంగా డ్రమ్ సీడర్ తయారు చేశారు.
కిరాయితో ఉపాధి..
Drum Seeder by Aler Farmer : డ్రమ్ సీడర్ తయారీకి 1,800 మాత్రమే ఖర్చయ్యిందని తెలిపిన మల్లేశ్.. ఈ పరికరంతో ఎనిమిది వరుసలుగా విత్తనాలు వేయవచ్చని తెలిపారు. డ్రమ్ సీడర్ ధర మార్కెట్లో సుమారు 6 వేల నుంచి 7 వేల 500 వరకు ఉందని వివరించారు. తాను తయారు చేసిన డ్రమ్ సీడర్‌ను ఎవరైనా రైతులు అడిగితే కిరాయికి ఇవ్వడం వల్ల ఉపాధి కూడా దొరుకుతుందని యువరైతు మల్లేశ్ వెల్లడించారు.
నాన్నకు ప్రేమతో..
'వరినాట్లు వేసే సమయంలో ఇక్కడ కూలీల కొరత తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ దొరికినా.. ఎక్కువ నగదు ఇవ్వాల్సి ఉంటుంది. నాటు వేయడానికే చాలా ఖర్చవుతోంది. అందుకే కూలీలు లేకుండా విత్తనాలు వేసేందుకు డ్రమ్ సీడర్‌ను తయారు చేశాను. దీనికి తక్కువే ఖర్చయింది. ఒకసారి ఈ సీడర్లో 10 నుంచి 15 కిలోల విత్తనాలు నింపవచ్చు. ఒకసారి నింపితే ఎకరం విస్తీర్ణంలో విత్తనాలు వేయొచ్చు. ఇప్పటి నుంచి నేను డ్రమ్ సీడర్ వరి సాగు చేస్తాను. అధిక లాభాలు గడిస్తాను. మా నాన్న జనరేషన్‌కు నా జనరేషన్‌కు చాలా తేడా ఉంది. ఆయన చాలా కష్టపడి పంట పండించే వాడు. కానీ నేను ఆధునిక పద్ధతిలో పంట పండించి మా నాన్నకు రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను.'
- మల్లేశ్, యువరైతు
- ఇదీ చదవండి : 'పండగలు శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యానికి సూచిక'