యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో జిల్లా ప్రజలలో అనందం వ్యక్తమవుతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని జైన్ మహావీర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సెంటర్లో ఉచితంగా వైద్య సదుపాయం అందించనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. డయాలసిస్ కేంద్రానికి కావాల్సిన వైద్య సిబ్బంది, నిర్వహణ బాధ్యత పూర్తిగా ట్రస్ట్ వారే నిర్వహించనున్నారని తెలిపారు.
ఈ సెంటర్ జిల్లా వాసులకు, చుట్టుపక్కల ఉన్న జిల్లాల వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు ఎంతో మంది ప్రైవేటు వైద్యం చేయించుకోలేక మృత్యువు బారిన పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి నెలా నాలుగైదు సార్లు కిడ్నీ రోగులను హైదరాబాద్కు తీసుకువెళ్లి డయాలసిస్ చేయించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. తన చిరకాల వాంఛ అయిన ఈ డయాలసిస్ సెంటర్ ఇప్పుడు తన చేతుల మీదుగా పూర్తి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ ఛైర్ పర్సన్ వస్పరి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాయపర్తిలో హరితహారం మెక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి