యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెద్ద కందుకూరుతో పాటు తాళ్లగూడెం, రామాజిపేట, ఎల్లమ్మతండా గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలోనే చదువుకుంటారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు ఏ పెచ్చు ఊడిపడుతుందో... ఏ గోడ కూలిపోతుందో అనే దుస్థితిలో ఉంది. పెచ్చులూడి విద్యార్థులకు గాయాలవుతున్నాయి. క్లాసు రూముల్లో భయం భయంగా చదవలేక బయట చెట్ల కింద, వరండాలో పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు. వర్షం పడితే విద్యార్థులు, ఉపాధ్యాయుల బాధ వర్ణనాతీతం. ఆరుబయట ఉండలేరు. తరగతిలో ఎప్పుడు ఏ పెచ్చు ఊడుతుందో తెలియదు.
భవన నిర్మాణానికి ముందుకొచ్చిన పూర్వ విద్యార్థి
శిథిలావస్థకు చేరిన పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక సర్పంచ్ ద్వారా తెలుసుకున్న పూర్వ విద్యార్థి ఒకరు నూతన భవన నిర్మాణానికి ముందుకొచ్చారు. బడి ఆవరణలో నిర్మాణం మొదలుపెట్టారు. కానీ కొందరి రాజకీయాల వల్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్త పాఠశాల నిర్మిస్తామని ముందుకొచ్చిన దాతకు గ్రామస్థులు సహకరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
'మా పాఠశాల మంచిగా లేదు. వర్షం వచ్చినప్పుడు పై కప్పు నుంచి పెచ్చిలూడి మా మీద పడుతున్నాయి. మేము సరిగా చదువుకోలేకపోతున్నాం. సర్పంచ్‌కు చెప్తే కొందరు దాతలను తీసుకొచ్చారు. వారిని కొందరు కట్టనివ్వడం లేదు. చాలా గ్రామాల నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ పాఠశాలను బాగుచేయక పోతే మేము కూడా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కరోనా వల్ల బయట పరిస్థితులు కూడా బాగా లేవు. దయచేసి త్వరగా భవనాలను నిర్మించండి.
-విద్యార్థిని
ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న పాఠశాలలు
పాఠశాల పరిస్థితిపై ఉన్నతాధికారులకు తెలియజేశామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కరోనా తర్వాత బడి ఇప్పుడిప్పుడే ప్రారంభం కాగా... స్కూల్ పరిస్థితిపై పై అధికారులకు నివేదిక అందజేశామని టీచర్లు అంటున్నారు.
'ఈ పాఠశాల కూలిపోయే దశలో ఉంది. తరగతి గదుల్లో పిల్లలు కూర్చుంటే కూడా వారిపై పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షాకాలంలో క్లాస్ రూముల్లో విద్యార్థులు కూర్చునే పరిస్థితి లేదు. బియ్యం కూడా వర్షపు నీటిలో నానే పరిస్థితి లేదు. పిల్లల చదువు సాగే స్థితిలో లేదు. తప్పకుండా దాతలు ముందుకొచ్చి భవనాలను నిర్మించాలని కోరుకుంటున్నాం.' -ఉపాధ్యాయుడు, పెద్దకందుకూరు జడ్పీహెచ్ఎస్
కరోనా తర్వాత పెద్ద కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: MLC candidates Assets: ఎమ్మెల్సీ బరిలో 'కోటీశ్వరులు'... ఆస్తుల వివరాలివే!