పదవుల మీద వ్యామోహం, బంధుప్రీతి, రాజకీయ పగ, ప్రతీకారం వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానం వద్ద నిరుద్యోగ నిరాహర దీక్షను ఆమె చేపట్టారు. వరంగల్‌కు సీఎం కేసీఆర్ ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు. వరదలు వస్తే ప్రజలు రోడ్లపై పడవలు వేసుకుని తిరుగుతున్నారని అన్నారు. ఎన్నికలు ఉంటేనే సీఎంకు పథకాలు గుర్తుకు వస్తున్నాయని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేవరకు దీక్షలు కొనసాగిస్తామని షర్మిల స్పష్టం చేశారు.
కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేదు
ఎన్నికలు ఉంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను తీసుకొస్తారని షర్మిల ఎద్దేవా చేశారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. కేంద్రాన్ని గట్టిగా అడిగే ధైర్యం ముఖ్యమంత్రికి లేదన్నారు. ఓరుగల్లు అభివద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ వరంగల్‌కు దేవాదుల, కాకతీయ థర్మల్ ఫ్లాంట్, ఐటీ పార్కును తీసుకొచ్చారని అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే వరకు నిరాహర దీక్షలు చేస్తానని షర్మిల స్పష్టం చేశారు.
'తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను నమ్మించారు సీఎం కేసీఆర్. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారికి పదవులే ముఖ్యం. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారు. వరంగల్ జిల్లాకు ఏం చేశారు. వరంగల్‌లో పడవులు వేసుకుని తిరిగేలా చేశారు. బ్రహ్మంగారికి సాధ్యం కానిదీ చేసి చూపించారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు? కేసులకు భయపడి కేంద్రాన్ని నిలదీయడం లేదు. వరంగల్ అభివృద్ధికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారు. ఏడేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చని సీఎం కేసీఆర్ మాత్రమే.'
- వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
ఇదీ చూడండి: YS Sharmila: కేసీఆర్ స్పందించాలంటే.. ఇంకెంతమంది నిరుద్యోగులు చనిపోవాలి: షర్మిల