Cyclist Ranjith trip to China border : ఆధునిక హంగులున్న సైకిల్.. దానికి ప్రత్యేకంగా అమర్చిన బుట్టలో ఓ బుజ్జి కుక్కపిల్ల.. ఎవరీ వ్యక్తి? ఎక్కడికీ ప్రయాణం.. అనుకుంటున్నారా.. ఈ యువకుడి పేరు రంజిత్ దాగర.. వరంగల్‌లోని కరీమాబాద్ ప్రాంతం.. ఎం.ఫార్మసీ చదివాడు.. సైకిల్ యాత్రలంటే సరదా. తండ్రి రాములు న్యాయవాది. హైబీపీ, సుగర్ వ్యాధులతో బాధపడుతూ కొవిడ్ కాటుకు గురయ్యారాయన. ఈ నేపథ్యంలో జనంలో ఆరోగ్య స్పృహను పెంచాలని.. సైక్లింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు రంజిత్.
చేస్తున్న ఉద్యోగాన్ని వీడి.. గతేడాది ఒంటరిగా సైకిల్‌పై లద్దాఖ్ యాత్రకు బయలుదేరాడు. 60 రోజుల్లో విజయవంతంగా దాన్ని పూర్తిచేశాడు. అంతకు ముందు 2020లోనూ కన్యాకుమారి వరకూ వెళ్లొచ్చాడు. ఈ యాత్రల్లో భాగంగా మార్గమధ్యలో ఆగినచోటల్లా సైక్లింగ్ ప్రయోజనాలు వివరిస్తూ యువతలో చైతన్యం నింపుతున్నాడు.. ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణించే రంజిత్.. ఈసారి చైనా సరిహద్దు వరకూ సంకల్పించిన సైకిల్ సాహస యాత్రకు పెంపుడు కుక్కపిల్ల భగీరతో పాటు బయలుదేరాడు. మంగళవారమే తన యాత్రను హైదరాబాద్ నుంచి మొదలెట్టాడు.
ఇదీ చదవండి: IAS Wedding Invitation Video Viral : లవ్‌స్టోరీ వీడియోతో ఐఏఎస్ పెళ్లి ఆహ్వానం..