రేషన్ షాపుల్లో ధరల పట్టిక, స్టాక్ నిల్వ వివరాల సూచిక బోర్డుల ప్రదర్శనకు డీలర్లకు ఆదేశాలు జారీ చేస్తామని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. హన్మకొండ లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజిలెన్స్ కమిటీతో జరిపిన సమీక్షా సమావేశంలో ఆయన తెలిపారు. రేషన్ బియ్యం, గ్యాస్ సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు.
జిల్లాలో దాదాపు 2,66,076 రేషన్ కార్డుల ద్వారా సుమారు 459 రేషన్ షాపుల ద్వారా రేషన్ సరఫరా జరుగుతుందన్నారు. ఇప్పటి వరకూ అక్రమంగా బియ్యం తరలించిన వారిపై 105 కేసులు నమోదు చేశామని వివరించారు. అక్రమంగా రేషన్ బియ్యం అమ్మడం గాని, కొనడం గాని నేరమని తెలిపారు. రేషన్ బియ్యం తూకంలో వ్యత్యాసాలు, రేషన్ స్టాక్, విక్రయాల సమయ పాలన, ధరల పట్టిక ఏర్పాటు, షాపుల పేర్లతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని పలువురు విజిలెన్స్ కమిటీ సభ్యులు కలెక్టర్కు సూచించారు.
తదుపరి సమావేశం నాటికి సమస్యలను పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేస్తామని, సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ సభ్యులకు సూచించారు. సభ్యుల సూచన మేరకు సిపిసి కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: మాటమాట పెరిగి.. కర్రలతో కొట్టుకున్నారు!