అద్దె బస్సులు నడుపుతున్న డ్రైవర్లకు సెప్టెంబర్ బిల్లులో 70 శాతమే చెల్లించారని, మిగిలిన 30 శాతం బిల్లు చెల్లించాలని కోరుతూ వరంగల్ రీజినల్ మేనేజర్‌కు జిల్లా అద్దె బస్సుల యజమాుల అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బ మధుకర్‌రెడ్డి లేఖ రాశారు.
ప్రస్తుత బకాయిలను ఒక్కో బస్సుకు దాదాపు రూ.1,50,000లు రెండు రోజుల్లో చెల్లించాలని కోరారు. చెల్లించనిపక్షంలో బస్సులను ఆపరేట్ చేయమని హెచ్చరించారు. అక్టోబర్ నెల బకాయిలు కూడా ఇంకా చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు.
డీజిల్ పై చెల్లిస్తున్న రూ.4వేలు సరిపోక తాము అదనంగా ఒక్కో బస్సుకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. సమయానికి బిల్లులు రాకపోవడం వల్ల ఫైనాన్స్, ఈ.ఎం.ఐ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్)లతో పాటు డ్రైవర్ల జీతాలు కూడా చెల్లించలేక పోతున్నామని పేర్కొన్నారు.
తాత్కాలిక డ్రైవర్లకు ఆర్టీసీ యాజమాన్యం రూ.1500 చెల్లిస్తున్నారు. అద్దె బస్సుల యజమానులమైన తాము మాత్రం రూ.700ల నుంచి రూ.800ల లోపే చెల్లిస్తున్నామని తెలిపారు.
తాము ఇచ్చే దాని కంటే ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చే వేతనం అదనంగా ఉండడం వల్ల ఆర్టీసీ బస్సులు నడిపేందుకే మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల అద్దె బస్సు డ్రైవర్లను ఆర్టీసీ బస్సులు నడపడానికి అనుమతించకూడదని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి : అదే పటిమ... ఆర్టీసీ సమ్మె మరింత ఉద్రిక్తం