చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు కోట ఆనవాళ్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. భూ బకాసురుల చెరలో చిక్కి పురాతన కట్టడాలు ప్రాశస్త్యాన్ని కోల్పోతున్నాయి. చారిత్రక నిర్మాణాలు, రాతి కోట, మట్టి కోట అన్నీ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. స్థిరాస్తి మాఫియా కోటకు బీటలు వేసి, భూములను ఆక్రమిస్తున్నాయి. వరంగల్ కోట లోపలి భాగంతో పాటు మట్టి కోట చుట్టూ ఆక్రమణలు కొనసాగుతున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ తరఫున ఆక్రమణదారులకు నోటీసులివ్వడం మినహా ఎలాంటి చర్యలు లేకపోడం వల్ల కబ్జాలు ఆగడం లేదు.
ఓరుగల్ల కోట కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఉంది. కోట లోపల శిలాతోరణాలతోపాటు 50 వరకు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. చుట్టూ నాలుగు కిలోమీటర్ల మేర రాతి కోట, దారి తర్వాత ఏడు కిలోమీటర్ల మేర మట్టి కోటను నాటి పాలకులు నిర్మించారు. మట్టి కోట చుట్టూ నీటితో నిండిన ఆగడ్త(కందకం) కనిపిస్తుంది. వరంగల్ నగర శివార్లలో భూముల ధరలు పెరగడం వల్ల ఆక్రమణలు జోరందుకున్నాయి. కబ్జాదారులు కొన్ని చోట్ల నీటితో నిండిన ఆగడ్తను సైతం మట్టితో పూడ్చేసి ప్లాట్లుగా చేస్తున్నారు. ఇటీవల మట్టికోట సమీపంలో ఉన్న మిల్స్ కాలనీ పోలీసుస్టేషన్ సమీపంలో ఉన్న కందకాన్ని కొందరు ఆక్రమణదారులు మొరంతో పూడ్చేసి చదును చేశారు. మట్టి కోట చుట్టూ నిషేదిత ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా మొదట చెత్త గుట్టలు పోసి తర్వాత దాన్ని చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. అనేక చోట్ల కందకాన్ని కూడా ఆక్రమించేసి ఇళ్లు కట్టారు. కోట లోపలి భాగంలోని వ్యవసాయ భూముల్లోనూ కొందరు స్థిరాస్తి వ్యాపారులు అక్రమ లేఅవుట్లు చేసి విక్రయిస్తున్నారు.
ఇవీ నిబంధనలు
కేంద్ర పురావస్తు శాఖ ఏఎస్ఐ నిబంధనల ప్రకారం పురావస్తు కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలకు అనుమతించరు. 100 నుంచి 200 మీటర్ల దూరంలో గతంలో ఉన్న ఇళ్లకు మరమ్మతు చేసుకోవాలన్నా భవనాలు కట్టాలన్నా పురావస్తు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోపీ) తీసుకోవాల్సిందే. ఈ నిబంధనలు ఆక్రమణదారులు కాలరాస్తున్నారు. ఏఎస్ఐ అనుమతి లేకుండా ఇంటి నెంబరు ఇవ్వడం, విద్యుత్తు కనెక్షన్ మంజూరు చేయడం లాంటివి నిషిద్ధమైనా, ప్రభుత్వ శాఖలు పట్టించుకోవట్లేదు.
నోటీసులిస్తున్నాం
కోట లోపల బయట అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మాట వాస్తవమే. నిబంధనలు పాటించని వారికి నెలకు కనీసం పది చొప్పున ఇప్పటి వరకు 200కు పైగా నోటీసులు ఇచ్చాం. ఇప్పటికే ఎన్నోసార్లు స్థానికంగా అవగాహన కల్పించాం. ఇటీవల పోలీస్స్టేషన్ వద్ద మట్టికోటకు అనుకుని ఉన్న ఆగడ్త వద్ద చదును చేస్తే అడ్డుకున్నాం. కేంద్ర పురావస్తు శాఖ నుంచి ఉత్తర్వులు వస్తే కలెక్టర్ అనుమతితో అక్రమ నిర్మాణాల్ని కూల్చేస్తున్నామని పురావస్తు శాఖాధికారి మల్లేశం అంటున్నారు.
ఏది ఏమైనా కాకతీయుల కాలం నాటి చరిత్రకు తార్కానంగా నిలుస్తున్న వరంగల్ కోట అందాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని చరిత్రకారులు అంటున్నారు.
ఇదీ చూడండి : కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం