కరోనా నుంచి ఓరుగల్లు మెల్లగా కోలుకుంటోంది. ఇప్పటి వరకు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన 20 మంది గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వ్యక్తుల సంబంధీకులు 361 మందికి నెగిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
పూరిగుట్ట కంటెన్మైంట్ జోన్లో ఆరోగ్య కార్యకర్తల ఆధ్వర్యంలో ముమ్మరంగా సర్వే జరుగుతోంది. జిల్లా డీఎంహెచ్ఓ సర్వైలెన్స్ అధికారులు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. జిల్లాలో హోంక్వారెంటైన్లో 1,064 మంది ఉండగా.. 812 మంది టెలీ మెడిసిన్ ద్వారా వైద్యసలహాలు పొందారు.
గ్రీన్‌జోన్‌గా ములుగు జిల్లా
ములుగు జిల్లాలో మర్కజ్ వెళ్లి వచ్చిన ఇద్దరికి నెగిటివ్ రావడం వల్ల జిల్లా గ్రీన్ జోన్‌గా మారిందని కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. రంజాన్ మాసం దృష్ట్యా ముస్లిం సోదరులు సాముహిక ప్రార్థనలు చేయరాదని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
బండ నాగారంలో డీసీపీ పర్యటన
తాజాగా కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసిన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారంలో డీసీపీ శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఆరోగ్య కార్యకర్తల సర్వేను పర్యవేక్షించారు. సోడియం హైపో క్లోరేట్ మందును సిబ్బందితో పిచికారీ చేయించారు. గ్రామంలోనికి ఎవరూ రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
కార్మికులకు సరుకుల పంపిణీ
జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద మండలం లోని 17 గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలకు మాజీ పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ పెద్ది రాజురెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
మొబైల్ రైతుబజార్
భూపాలపల్లిలో రెడ్ జోన్లుగా ప్రకటించిన మిలియన్ క్వార్టర్స్, సుభాష్‌కాలనీలలో ఫోన్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి కూరగాయలు, నిత్యావసర వస్తులను మొబైల్ రైతుబజార్ ద్వారా కలెక్టర్ అందజేశారు.
ప్రజలు సహకారంతోనే
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ, భౌతిక దూరం పాటిస్తూ కరోనాను తరిమికొట్టడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారని జిల్లా వైద్య, పోలీసు అధికారులు తెలిపారు.