లాక్డౌన్ నేపథ్యంలో కుదేలైన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద నిర్దేశించిన విధంగా రూ.10 వేలరుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వారి కోసం చట్టాన్ని తెచ్చి లైసెన్సు, ధ్రువీకరణ పత్రాలతో పాటు వెండర్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. నగరంలో 3,519 మంది వీధి వ్యాపారులకు త్వరితగతిన 10 వేల రుణాలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, లీడ్ బాంక్ మేనేజర్, మెప్మా అధికారులు పాల్గొన్నారు.