వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్‌లు పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి లక్షలాది మందిని బలి తీసుకుందని వినోద్ కుమార్ తెలిపారు. కరోనా వ్యాధి సోకిన వారిలో తాను కూడా ఒకరినని అన్నారు. కరోనా వ్యాధి నుంచి విముక్తి పొందిన నెల రోజుల తర్వాత అనేక రకాల బలహీనతలతో తానూ ఇబ్బందులకు గురయ్యానని గుర్తుచేశారు.
రెండు, మూడేళ్లకు వస్తుందనుకున్న కరోనా వ్యాక్సిన్ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఏడాది లోపే వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీకా మన దేశంలోనే తయారై పంపిణీ జరగడం గొప్ప విషయమన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గ్రామం వంగరలో ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించడం శుభదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి : వికారాబాద్ అడవిలో బుల్లెట్ కలకలం... ఎక్కడిది?