Thieves stole 30 tolas of gold in Warangal: ఎప్పుడైన ఊరికి వెళ్లేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండటం ఎంతో మంచిది. ఏం కాదులో అనుకుంటే నష్టం తప్పదు. సిటీ అయినా, పట్టణమైనా, పల్లెటూరు అయినా దొంగల సమస్య తప్పదు. అందుకే అత్యవసరమైన పనిమీద వెళ్లినా.. చాలా రోజులు వెళ్తున్నా.. రాత్రికే వస్తాలే అనుకున్నా.. జాగ్రత్తలు తీసుకోవడం మరిచామో దొంగలు మనల్ని నిలువునా దోచేస్తారు. అప్పటివరకు సంపాదించుకున్నదంతా క్షణాల్లో మింగేస్తారు. ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో జరిగింది.
స్థానికులు, బాధతులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో గొలికార్ గోపి అతని ముగ్గురు అన్నదమ్ములతో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే యాదగిరి గుట్టలో జరిగిన బంధువుల పదోరోజు కార్యక్రమానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు శుక్రవారం రాత్రి సమయంలో మొదట ఇంటిపై కప్పు తొలగించేందుకు యత్నించారు. ఆ తరువాత ఇంటి తలుపులు పగలగొట్టి బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బాధిత కుటుంబానికి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే వారు ఇంటికి చేరుకొని జరిగిన ఘోరాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. సుమారు రూ.15 లక్షలు విలువ చేసే 30 తులాల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారని నిర్ధారించుకున్నారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారాన్ని బాధితులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. దొంగతనం జరిగిన విధానాన్ని అంచనా వేశారు. దుండగుల వేలిముద్రలను సేకరించారు. గ్రామస్థులందరిని అడిగి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొన్నారు. జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
"మా చిన్నమామయ్య చనిపోతే కార్యక్రమని యాదగిరి గుట్టకి వెళ్లాం. మా ఇంటి పక్కన ఉన్న వారు మీ ఇంట్లో దొంగతనం చేశారని ఫోన్ చేసి చెబితే వెంటనే వచ్చాం. మేము వచ్చే సరికి ఇల్లు చూస్తే అంతా చిందర వందరగా ఉంది. తలుపులు పగలగొట్టి ఉన్నాయి. బీరువా లాకరు తీసి ఉంది. ఆ బీరువాలో బంగారం, బట్టలు ఉండేవి. నగదు కూడా దాచి పెట్టుకున్నాం. బంగారు ఆభరణాలన్నింటిని దొంగతనం చేశారు. ఎలాగైనా మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా నగలు మాకు వచ్చేటట్టు సాయం చేయాలని వేడుకుంటున్నాను." -బాధితురాలు
ఇవీ చదవండి: