రాష్ట్రంలో కొత్త కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ.. కేంద్ర రైల్వే శాఖ పేర్కొనడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ సాధనకు ఉద్యమించేందుకు.. రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 10న అన్ని సంఘాలు రౌండ్ టేబుల్ నిర్వహించి పోరాటానికి శ్రీకారం చుడుతున్నాయి. తెలంగాణ ప్రజల హక్కైన కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు లేదన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేవరకు తగ్గేది లేదని చెబుతున్నారు. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా.. అందరూ కలసి రావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికార తెరాస నాయకులు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ధర్నాలు, ఆందోళనలు చేశారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కొత్తగా కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పి వరంగల్ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని నేతలు విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకూ...తమ పోరు ఆగదని స్పష్టం చేశారు.
ఈ నెల 8 నుంచి జరిగే మలి విడత పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయడానికి తెరాస సన్నద్ధమవుతోంది.