నెలరోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి వరంగల్‌లో పర్యటిస్తున్నారు. వరంగల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ స్వాగతం పలికారు. ఏకశిలా పార్కులో జయశంకర్ విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. కాళోజీ ఆరోగ్య వర్సిటీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఐదెకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్లతో.. మొత్తం ఐదు అంతస్తుల్లో వర్సిటీ పరిపాలనా భవనాన్ని నిర్మించారు. కాళోజీ ఏడున్నర అడుగుల కాంస్య విగ్రహంతోపాటు... ప్రాచీన వైద్యశాస్త్ర ప్రముఖుల ప్రతిమలను విశ్వవిద్యాలయం ముందు అందంగా తీర్చిదిద్దారు.
మే 21న ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన కేసీఆర్... రోగుల తాకిడికి తగ్గట్లుగా ఆస్పత్రి సరిపోవట్లేదని గుర్తించారు. ఈ క్రమంలో వరంగల్ జైలు ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించారు. 56 ఎకరాల్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌కు దీటుగా.. సర్కారీ దవాఖానాల్లో అతిపెద్దదిగా ఉండాలని సూచించారు.
అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రి...
వరంగల్ కేంద్ర కారాగారం ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. 50 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా భూమి పూజ నిర్వహించారు. 54 ఎకరాలలో రూ. 1,000 కోట్ల వ్యయంతో 2 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు.
వైద్య విద్యార్థుల కోసం సెమినార్ హాళ్లు, మినీ ఆడిటోరియం, రోగుల సహాయకుల కోసం 100 ప్రత్యేక గదులు, 30 అంతస్తులలో 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఆస్పత్రిపై అంతస్తులో హెలిప్యాడ్ నిర్మిస్తారు. అత్యవసర చికిత్స అందించే రోగులను ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొని వచ్చి వైద్యం అందించేందుకు వీలుగా హాస్పిటల్‌పై అంతస్తులో హెలిప్యాడ్ నిర్మించాలని ప్రణాళికలు రచించారు.
కలెక్టరేట్ ప్రారంభం...
భూమిపూజ అనంతరం... వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సీఎంకు ఓరుగల్లు జిల్లా అధికారులు, కళాకారులు ఘనస్వాగతం పలికారు. వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా, అన్ని శాఖల అధికారులు ఒకే చోట ఉండేలా రూ. 57 కోట్ల వ్యయంతో మూడు అంతస్తుల్లో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారు. 100 ఏళ్లు అయినా చెక్కుచెదరకుండా భవనాన్ని నిర్మించారు.
కాకతీయుల ఘన కీర్తిని చాటేవిధంగా భవనం ముందు కొలువుతీరిన కళాతోరణం.... చూపరులకు కనువిందు చేస్తోంది. అనంతరం తెరాస నేత కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి భోజనం చేయనున్నారు. వెంటనే యాదాద్రికి పయనం కానున్నారు.
ఇదీ చూడండి: CM Tour: వైకుంఠాన్ని తలపించేలా యాదాద్రి