వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్‌లో నవంబర్ 1 నుంచి 3 రోజులపాటు టెక్నోజియాన్ వేడుకలు జరగనున్నాయి. నోవాస్ అనే థీంతో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి సుమారు 5 వేలకు పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. ఈ వైజ్ఞానిక ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని స్టూడెంట్ డీన్ ఎల్‌ఆర్‌జీ రెడ్డి తెలిపారు. విద్యార్థి క్లబ్‌ల ఆధ్వర్యంలో 55కి పైగా ఈవెంట్లను నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన ఏడుగురు ప్రముఖులతో ప్రసంగాలు కూడా ఇప్పించనున్నారు. విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే విధంగా పలు వైజ్ఞానిక, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక అంశాల ప్రదర్శనలు ఉంటాయని వారు తెలిపారు. ఈ వేడుకలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి సుమారు 4 లక్షల విలువచేసే బహుమతులు ఇవ్వనున్నట్లు విద్యార్థి బృంద సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి