రాతిని చెక్కి గణపతిని తయారు చేయడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి, పత్రాలు, కొబ్బరికాయలు, కూరగాయలు, ఆఖరికి పూలతో వినాయక విగ్రహాలను తయారు చేయడం మనకు తెలిసిన విషయమే. కానీ ఒక వృక్షమే వినాయకుడి రూపంగా మారడం కనీవినీ ఎరుగం. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో మాత్రం తెల్లజిల్లేడు చెట్టు గణపతి రూపంలో ఉద్భవించి భక్తుల చేత పూజలందుకుంటోంది. ఈ స్వామిని శ్వేతార్క గణపతి అని కూడా పిలుస్తారు.
పద్దెనిమిదిన్నర కేజీల వెండికవచం
గణపతి వెలిసిన విషయం తెలిసుకున్న స్థానికులే ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. కోరిన కొర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందడం వల్ల నగరం నలుమూలనుంచే కాకుండా హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో వేకువజాము నుంచి రాత్రి వరకు స్వామి వారికి నిత్యపూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఆరంభంలో స్వామి నిజరూపానికే అభిషేకాలు జరిగినా... ఆ తరువాత పద్దెనిమిదిన్నర కేజీల వెండికవచాన్ని స్వామికి ధరింపచేసి అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు.
ఈనెల 12న కల్యాణమహోత్సవం
మంగళ, శని, ఆదివారాల్లో సంకటహర చతుర్థి సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ఇక గణపతి నవరాత్రి ఉత్సవాలు అయితే ఇక్కడ అంగరంగవైభవంగా జరుగుతాయి. నిత్యం పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు భక్తులను విశేషంగా అకట్టుకుంటాయి. ఈనెల 12న శ్వేతార్కగణపతి కల్యాణమహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఈటల మాటలకు ఎర్రబెల్లి వివరణ ఇవ్వటం దౌర్భాగ్యం'