కొంతకాలంగా విచారణకు హాజరు కానందుకు తెరాస నేత తక్కళ్లపల్లి రవీందర్ రావు తదితరులపై ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్కళ్లపల్లి రవీందర్ రావు సహా ఏడుగురికి రిమాండ్ విధించిన న్యాయస్థానం.. అనంతరం ఒక్కొక్కరికి పది వేల రూపాయల పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. నిందితుడిగా ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆచూకీ లభించడం లేదని సుబేదారి పోలీసులు ఇచ్చిన వివరణను న్యాయస్థానం రికార్డు చేసింది.
రిమాండ్... బెయిల్
వరంగల్ జిల్లా కోర్టులో ఉన్నప్పుడే దాస్యం వినయ్ భాస్కర్, తక్కళ్లపల్లి రవీందర్ రావు, రమేశ్, దర్శన్ సింగ్, మనోజ్, రహమున్నీసా, లలితపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. హైదరాబాద్లోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయినప్పటి నుంచి హాజరు కాలేదు. ఇవాళ విచారణకు హాజరు కాగానే అదుపులోకి తీసుకొని రిమాండ్ విధించి, అనంతరం బెయిల్ మంజూరు చేసింది. మరోకేసులో కాజీపేట పోలీసులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
క్రిమినల్ కేసు నమోదు చేస్తాం
వరంగల్ తెరాస నేతలు అమరేందర్ రెడ్డి, శ్రీరాములు, నరోత్తంరెడ్డిలపై నాన్ బెయిలబుల్ వారంట్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఫిబ్రవరి 3లోగా నాన్ బెయిలబుల్ వారంట్ అమలు చేయకపోతే కాజీపేట ఎస్హెచ్ఓపై క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో నమోదైన పలు కేసుల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.
ఇదీ చదవండి : మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని పీఆర్సీ నివేదిక