వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్డులో ఉన్న సత్య ఆసుపత్రి ఎదుట మృతదేహంతో కొందరు ధర్నా చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే యాకయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వర్ధన్నపేటకు చెందిన యాకయ్య రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలుని కోల్పోయాడు. చికిత్స నిమిత్తం సత్య ఆసుపత్రికి రాగా... చికిత్స చేసి ఇంటికి పంపించారు. గత కొంత కాలంగా యాకయ్య కాలు నుంచి రక్త స్రావం అవుతోంది.
ఆసుపత్రికి తీసుకురాగా.. యాకయ్య మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే యాకయ్య మృతి చెందినట్లు ఆయన బంధువులు ఆరోపిస్తూ ధర్నాకి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తేనే.. అక్కడి నుంచి కదులుతామని చెప్పారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళనను విరమించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష