మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ అందంగా ముస్తాబవుతున్నాయి. కాజీపేట్ మండలం మడికొండలోని శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆలయంలో శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఒకే క్షేత్రంలో ఉండడం ప్రత్యేకత.
భక్తుల కోసం చలువ పందిళ్ళు నిర్మించారు. విద్యుత్ దీపాలంకరణలతో తీర్చిదిద్దుతున్నారు. మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. శివరాత్రి ఉదయం 3 గంటల నుండే స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం వేళ అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తామని ఆలయ అర్చకులు రాగిచెడు అభిలాష్ శర్మ తెలిపారు. సాయంత్రం వేళ జాగారానికి వచ్చే భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ, అధికారులు తెలిపారు.