కంటికి కనిపించని కరోనా వైరస్ ఎంతటి కల్లోలం సృష్టిస్తుందో... అందరికీ తెలిసిందే. మొదటి దశతో పోలిస్తే... రెండో దశ కంటిమీద కునుకు లేకుండా చేసింది. ప్రాణవాయువు దొరక్క, ఆసుపత్రుల్లో పడకలు లభించక.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారి కుటుంబసభ్యులూ.... నరకం అనుభవించారు. ఇదే సమయంలో మానవత్వంతో మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. అలాంటివారిలో వరంగల్‌కు చెందిన శాంత తౌటం(Shanta Thoutam) ఒకరు.
ట్విట్టర్‌లో తెలియజేస్తే..
అవసరం ఉన్నవారు ఆక్సిజన్ కావాలని ట్విట్టర్‌లో తెలియజేస్తే... కాన్సంట్రేటర్లను శాంత తౌటం అందించారు. ఎంతో మందికి ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టారు. ఉపాధి కోల్పోయి పస్తులుంటున్న కుటుంబాలకు నిత్యావసరాలు అందించి వారి ఆకలి తీర్చారు. గతేడాది లాక్‌డౌన్‌లో వలసకార్మికులకు సహాయం చేశారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆసుపత్రుల బిల్లులు కట్టలేనివారిని ఆదుకుని శాంత మానవత్వాన్ని చాటారు.
స్నేహితుల సహకారంతో ..
అమెరికాలో ఉన్న స్నేహితుల సహకారంతో 20 లక్షల నిధులు సమీకరించి వరంగల్ నగరపాలికకు అందించారు. నాస్కమ్ ఫౌండేషన్ ద్వారా 150 ఆక్సిజన్ సిలిండర్లను అవసరం ఉన్న వారికి అందిస్తున్నారు. కొవిడ్ బాధితులకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాయం అందించడం ద్వారా తనకు నిజమైన సంతృప్తి లభిస్తోందని శాంత చెపుతున్నారు. డబ్బులుంటే సరిపోదని... ఆపన్నులకు సాయమందించాలని అందిరికీ సూచిస్తున్నారు.
అనవసరంగా బయటికి రాకుండా... ఇంట్లో ఉండడం ద్వారానే వైరస్‌ను కట్టడి చేయగలమని శాంత అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో ఉంటూనే అవసరమైన వారికి సాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: TS UNLOCK: తెలంగాణ అన్‌లాక్.. ఇవన్నీ ఓపెన్