కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని అరోగ్య కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. కొన్ని కేంద్రాల వద్దకు ఉదయం 5 గంటలకే చేరి.. క్యూలో నిలబడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలిచ్చారు. రద్దీ అధికంగా ఉన్నచోట్ల అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో 28 కేంద్రాల్లో కొవాగ్జిన్, 8 కేంద్రాల్లో కొవిషీల్డ్ టీకాలు వేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు రెండూ ఇచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో 20 కేంద్రాల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మహబూబాబాద్‌లో 18, ములుగులో 16, జనగామలో 13, భూపాలపల్లిలో 10 కేంద్రాల్లో 45 ఏళ్ల నిండిన వారికి రెండో డోసు టీకాలిచ్చారు. రద్దీ లేకుండా ఎక్కువ కేంద్రాలు పెట్టాలని, టీకాలు ఆపకుండా అందరికీ ప్రతి రోజూ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.