'నేను(Sandhya kranthi) పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే ఆ రంగానికి సంబంధించిన కోర్సునే చదివా. రాజేంద్ర నగర్‌లోని ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ చేశా. ఎంఎస్సీ కూడా అక్కడే చదివా. ఆ తర్వాత దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ యూనివర్సిటీ నుంచి తెగుళ్ల నివారణ అంశంలో పీహెచ్‌డీ చేశాను. 1991లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ‘జాతీయ పత్తి పరిశోధన సంస్థ’లో శాస్త్రవేత్తగా ఉద్యోగం వచ్చింది. పత్తి(Cotton scientist) విత్తనాల సంరక్షణ విభాగానికి హెచ్‌ఓడీగా పనిచేశా. మా వారు కేశవ్ ఆర్.క్రాంతి ఇదే సంస్థలో సంచాలకునిగా ఉన్నారు. అలా ఇద్దరి లక్ష్యం ఒకటే కావడంతో పత్తిపంటపై మరింత లోతుగా అధ్యయనం చేయగలిగాను. పరిశోధనల్లో భాగంగా నాగ్‌పూర్ పరిసరాల్లోని అనేక ప్రాంతాలు తిరుగుతుండేదాన్ని. అప్పుడే మహిళల వ్యవసాయ విధానాలని సునిశితంగా గమనించాను. మేం ఇచ్చిన సలహాలు పాటించి పంటలు పండించి అద్భుతాలు చేసేవారు వాళ్లు. ఓ మహిళా రైతు వాతావరణ ప్రతికూలతలన్నింటినీ ఎదుర్కొని ఆ ప్రాంతంలో అందరికన్నా ఎక్కువ దిగుబడిని సాధించింది. ఆ మహిళా రైతులు ఇచ్చిన స్ఫూర్తి చిన్నదేం కాదు.. నేనింకా ఏదో సాధించాలన్న తపనని రగిల్చింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది స్వచ్ఛంద పదవీ విరమణ చేశా. పత్తికి సంబంధించి అంతర్జాతీయ పరిశోధనలు చేసేందుకు అమెరికా బాట పట్టాం నేనూ, మావారు. మాకు వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం (International Cotton Advisory Committee)లో పనిచేసే అవకాశం వచ్చింది.'
ఆఫ్రికా దేశాలకు సాయం
'ఏడాదిగా ఆఫ్రికాలోని వివిధ దేశాలకు చెందిన అయిదు ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్నా. బుర్కినాఫాసో, జాంబియా, ఐవరీకోస్ట్ వంటి దేశాల్లో పనిచేశాను. ఇవి ఎడారి దేశాలు, వాటి భౌగోళిక పరిస్థితులు భిన్నం. దిగుబడులు తక్కువ. వీటికి తోడు సాంకేతిక వెనుకబాటు, సరైన సాగు విధానాలు తెలియక అక్కడి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి సరైన పరిష్కారాలు అందివ్వాలనుకున్నా. కొవిడ్ కారణంగా ఆఫ్రికా వెళ్లకున్నా అమెరికాలోనే ఉంటూ వర్చువల్‌గా అక్కడి రైతులకు శిక్షణ ఇచ్చాను. ఆఫ్రికాలో పత్తి విస్తీర్ణం అధికంగానే ఉన్నా సరైన సాగు పద్ధతులు తెలియవు. జాంబియాలోని వందలాది రైతులకు పత్తి పండించే విధానాలపై శిక్షణ ఇచ్చాను. గతంలో వారు పెట్టిన పెట్టుబడితోనే అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో నేర్పా. ఒక్క ఏడాదిలోనే అక్కడి రైతులు 28 శాతం పత్తి దిగుబడులు పెంచుకోగలిగారు. అధిక సాంద్రతతో మొక్కలు నాటి దిగుబడి పెంచే విధానాలను వారికి పరిచయం చేశాం. బుర్కినాఫాసోలో పరిశోధనలు, శిక్షణ కోసం జర్మనీ మూడుకోట్ల రూపాయలు అందించింది. జాంబియాలో పరిశోధనల కోసం యురోపియన్ యూనియన్ సాయం చేసింది.'
తెలుగు వారికోసం యాప్
మా సంస్థ తరపునుంచీ ‘ప్లాంట్ హెల్త్’ యాప్‌ను కూడా రూపొందించా. ప్రపంచవ్యాప్తంగా 25 భాషల్లో ఉన్న ఈ యాప్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. సంస్థకు సంబంధించిన పత్రిక కోసం పత్తికి సంబంధించిన వివిధ రంగాల్లో 20 మంది మహిళలతో మాట్లాడి వారి ఇంటర్వ్యూలు తీసుకున్నాను. ఈ జర్నల్‌లో మహిళా రైతుల కోసమే ప్రత్యేకించి వ్యాసాలు రాస్తుంటాను. మగవారితో పోలిస్తే సాగు రంగంలో మహిళల విజయాలు అన్నీ ఇన్నీ కావు. వివక్ష తగ్గి అవకాశాలు పెరుగుతున్నాయి. పరిశోధనా రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు ఇది మంచి వేదిక.
-సంధ్యాక్రాంతి
ఇదీ చదవండి: TRS Maha Dharna: కేంద్రంపై ఉద్ధృత పోరుకు తెరాస సిద్ధం.. రేపే మహాధర్నా..