Sand Dunes In Farming Lands in Warangal : విత్తు నాటినప్పటి నుంచి పంటను కంటికి రెప్పలా కాపాడుకునే కర్షకులపై ప్రకృతి ప్రకోపం చూపిస్తూనే ఉంది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడి, నకిలీ విత్తనాలు, ఎరువులతో కుదేలవుతున్న రైతులకు వరదలూ మరో శాపంగా మారాయి. ఇటీవలి భారీ వర్షాలకు పొలాల్లో ఇసుక మేటలు వేయటంతో ఏం చేయాలో తోచని అన్నదాతలు తల్లడిల్లుతున్నాడు. ఇళ్లు, పొలాలు.. ఇలా సర్వం కోల్పోయిన కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూమి కొట్టుకుపోయి.. ఇసుక మేటలు..: మొన్నటి వరకు వానల కోసం ఎదురు చూసిన రైతులకు మునుపెన్నడూ లేని వర్షాలు తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించినా పంట చేతికొచ్చే పరిస్థితి లేని దీనావస్థకు ప్రకృతి నెడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికంగా కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. పత్తి చేలకు గండ్లు పడి, వ్యవసాయ బావి స్టార్టర్లు, మోటార్లు మునిగి పంట ఆరంభంలోనే భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. ఇసుక మేటలు తొలగించటమే ఓ ప్రహసనం కాగా పలుచోట్ల వరి పొలాల ఆనవాళ్లే లేకుండా పోవటంతో దిక్కుతోచక రైతులు ఆవేదన చెందుతున్నారు.
వ్యవసాయ భూముల్లో గండ్లు..: హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్లో నడికూడ, దామెర, ఆత్మకూర్, శాయంపేట, మండలాల్లో వరద తాకిడికి చాలా చోట్ల సాగు భూముల్లో గండ్లు పడ్డాయి. పత్తితో పాటు మిరపనారు, వరి నారుమడులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం బీభత్సం సృష్టించి కోలుకోలేని దెబ్బ తీసిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
"నాట్లు వేశాం. అంతా వర్షానికి కొట్టుకుపోయింది. ఇక్కడున్న బ్రిడ్జ్ కూడా పోయింది. చాలా నష్టం వచ్చింది. వర్షానికి భూములన్నీ పోయాయి. ఇసుక తిప్పలు వచ్చాయి. పెట్టిన పెట్టుబడి పోయింది. బతుకులు రోడ్డుపైన పడ్డాయి. ఎవరి పొలాల్లో చూసినా ఇలానే ఉంది. ప్రతి ఒక్కరి పరిస్థితీ ఇంతే. వరి వేసుకున్నాం.. అంతా కొట్టుకుపోయింది." - బాధితులు
పెట్టుబడి అంతా పాయే: గతేడాది వడగళ్ల వానతో చేతికొచ్చిన పంటలు పూర్తిగా ధ్వంసమై రైతులు నష్టపోయారు. ఈ ఏడు అత్యధిక వర్షాపాతంతో అవే పరిస్థితులు ఎదురయ్యాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి సాగు ప్రారంభించిన రైతులకు ఇటీవలి వర్షాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వమే రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాగులన్నీ ఉద్ధృతంగా ప్రవహించి పంట పొలాలను ముంచటంతో సాగు ఆరంభమే నష్టాలతో ప్రారంభమయ్యిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: