రోజూలాగే కళాశాలకు బయల్దేరిన ఆ యువతికి తెలియదు చావు వెంబడిస్తుందని. సహచర విద్యార్థే కర్కశకుడిగా తనపై దాడి చేస్తాడని ఊహించలేకపోయింది. కాలిన గాయాలకు ఎదురొడ్డి.. బతికి కలల్ని సాకారం చేసుకోవాలనుకున్న ఆ యువతి ఆశలు పెట్రోల్ మంటల్లో కలిసిపోయాయి. మృత్యువుతో పోరాడి ప్రేమోన్మాది కిరాతకానికి సజీవ సాక్ష్యంగా మారి.. ఇక సెలవంటూ శాశ్వతంగా వెళ్లిపోయింది. వారం రోజులుగా ఒళ్లంతా కాలిన గాయాలతో నరకం అనుభవించి తనువు చాలించింది వరంగల్ జిల్లాకు చెందిన రవళి.
రవళిపై పెట్రోల్ దాడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 70 శాతంపైగా కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 ఏళ్లకే అర్ధాయుష్కురాలై తనువు చాలించింది. బాధితురాలిని బతికించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించిన లాభం లేకపోయింది. శ్వాసనాళాలు కాలిపోవటం వల్ల ఊపిరి తీసుకోవటం కూడా కష్టమైంది. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చివరకు తుదిశ్వాస విడిచింది.
వరంగల్ గ్రామీణ జిల్లా రామచంద్రాపురానికి చెందిన రవళి.. హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. గత నెల 27న ఉదయం స్నేహితులతో కలసి వసతి గృహం నుంచి కళాశాలకు వెళుతుండగా.... దారిలో మాటువేసిన సహచర విద్యార్థి సాయి అన్వేష్ అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. గత కొంత కాలంగా నిందితుడు పెళ్లి చేసుకోమని బలవంతం చేయగా నిరాకరించిన రవళిపై కసి పెంచుకుని దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాపాడబోయిన తోటి విద్యార్థులపైనా.. పెట్రోల్ పోస్తానంటూ బెదిరించి చివరకు పరారయ్యాడు. పోలీసులు అన్వేష్‌ను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో 14 రోజులు రిమాండ్‌కు తరలించారు.
తీవ్రగాయాలై విషమ పరిస్థితుల్లో ఉన్న రవళిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ యశోదకు తరలించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడింది. రవళి మృతి... తల్లిదండ్రులు, బంధువులు తోటి విద్యార్థుల్లో తీరని విషాదాన్ని నింపింది. శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు.
ఇవీ చూడండి:రవళి మృతి