వరంగల్ గ్రామీణ, అర్బన్ జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులకు రాత్రి కురిసిన వర్షం కాస్తంత ఊరటనిచ్చింది. భారీ వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి.
జలమయం
అర్బన్ జిల్లాలోని కాజీపేట్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. వరద ప్రవాహానికి మురికి నీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని మైసయ్య నగర్, బాంబే కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరి నగరవాసులు అవస్థలు పడుతున్నారు.
సాగుకు ఆటంకం
గ్రామీణ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. రెండు రోజుల క్రితం కురిసిన తేలికపాటి వర్షంతో పత్తి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవగా.. రాత్రి కురిసిన వర్షానికి వ్యవసాయ భూములు పూర్తిగా నీటమునిగాయి. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి సంగెం మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడక్కడా పడిన పిడుగుపాటుకు పలు ఇళ్లు నేల కూలాయి.
ఇదీ చదవండి: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద