ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరు గాంచిన వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి రికార్డు ధరలు నమోదు చేస్తోంది. మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో క్వింటాల్ పత్తి ధర రూ.8,060 రూపాయలు నమోదైంది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాహుల్ వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరగడం, బేళ్ల ధరలతో పాటు పత్తి గింజలకు డిమాండ్ ఏర్పడటం వల్ల పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. మరోవైపు సాగు విస్తీర్ణం తగ్గడమూ ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు.
కష్టానికి తగిన ఫలితం..
ఏదేమైనప్పటికీ తాము పండించిన పంటకు మంచి ధర పలుకుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ తాము పడిన కష్టానికి తగిన ఫలితం దొరుకుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సీజన్లోనూ పత్తికి ఇలాగే మంచి ధర పలికితే.. ఈ తెల్ల బంగారం సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలో ధర పెరగడం బాధాకరమని రైతులు వాపోయారు.
గత నెలలో రూ.7 వేలు పలికిన తెల్ల బంగారం..
ఇదే వ్యవసాయ మార్కెట్లో గత నెలలో పత్తి ధరలు క్వింటాల్‌కు రూ.7 వేలు పలికాయి. గతేడాది రూ.6,500 దాటని తెల్ల బంగారం.. ఒక్కసారిగా రూ.7 వేలు ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఎనుమాముల మార్కెట్లో రికార్డు స్థాయిలో మిర్చి ధరలు