వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చదువుకున్న పాఠశాల, కళాశాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్ భాస్కర్ సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు పీవీ చదువుకున్న జూనియర్ కళాశాలను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని వినోద్ కుమార్ తెలిపారు. తానూ ఈ కళాశాలలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని పునరుద్ధరించి రాబోయే తరాలకు ఉపయోగపడేలా చేస్తామని వెల్లడించారు.
నిజాం కాలంలో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంతో మంది మహానుభావులు, స్వతంత్ర సమరయోధులతో పాటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చదువుకున్నారని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పీవీ నరసింహారావు జన్మస్థలంతో పాటు ఆయన విద్యను అభ్యసించిన పాఠశాల, కళాశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు.