Priyanka Gandhi Speech at Palakurthi Public Meeting : పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలోనే బందీ అయిందని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆరోపించారు. ఈ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందని.. అందుకే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఒక్కసారి తెలంగాణ వాసులు ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో లేదో ఆలోచించుకోవాలని సూచించారు. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ఆమె పాల్గొని.. బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో కుంభకోణం జరిగిందని.. పేపర్లు లీక్(Telangana Paper Leakage) కావడంతో యువత నిరాశకు గురయ్యారని ప్రియాంక గాంధీ ఆవేదన చెందారు. అలాగే కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్నారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడిందని మండిపడ్డారు. అసలు ఆ యువతి దరఖాస్తు చేయలేదని మాట్లాడారన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయని ఆమె హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేసి.. పేపర్ లీకేజ్‌లను అరికడతామని మాటిచ్చారు.
రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు
Congress Vijaya Bheri Sabha at Palakurthi : ఇంటిని నడిపించే గృహిణికి ఎన్నో కష్టాలు ఉంటాయని.. పిల్లలకు స్కూల్ ఫీజులు, అనారోగ్య సమస్యలు వంటివి ఉంటాయన్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళల కష్టాలు తొలగిపోతాయని ప్రియాంక అన్నారు. ప్రతి నెల మహిళ ఖాతాలో రూ.2500 వేస్తామని.. గ్యాస్ సిలిండర్(Gas Cylinder) రూ.500కే ఇస్తామని చెప్పారు. అలాగే మహిళామణులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోందని అన్నారు. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని చెప్పారు.
'కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీఎస్టీ, పెట్రోల్ ధరల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. వస్తువుల ధరలు మళ్లీ తగ్గాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. రైతులకు ధాన్యంపై క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ ఇస్తాం. కొన్ని వస్తువులకు ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్లే.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి డేట్ ముగిసింది'. -ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
Telangana Election Polls 2023 : పదేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహంకారంతో విర్రవీగుతున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఈ ప్రభుత్వాల పాలనలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అవినీతి పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి జోరుగా వీస్తోందని తెలిపారు. ఈ రాష్ట్రంలో దొరల పాలనను కూల్చి ప్రజల పాలనను కాంగ్రెస్ తీసుకువస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ గెలవకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్ విధానం : ప్రియాంక గాంధీ