రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ వరుణుడు ప్రతాపం చూపెడుతున్నాడు. దీంతో 10 నుంచి 25 సెంటీమీటర్లపైన వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వాగులు వంకలూ పొంగి ప్రవహించడంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జోరు వర్షాల సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..
⦁ వర్షం పడుతున్నప్పుడు...సాధ్యమైనంతవరకూ బయటకు వెళ్లకుండా ఇంటివద్దే ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరం.
⦁ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.
⦁ వరద నీరు రోడ్లపై పారుతున్నప్పుడు...ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించరాదు.
⦁ వర్షం వస్తున్నప్పుడు చెట్ల కింద ఉండరాదు.
⦁ వర్షంలో తడవడం, చిన్నపిల్లలు వర్షంలో ఆడుకోవడం చేయరాదు.
⦁ ఇక విద్యుత్ పరికరాలు, నియంత్రికలు, కరెంటు వైర్లు, మోటార్ల వద్ద కూడా జాగ్రత్తగా ఉండాలని ఎన్సీపీడీసీఎల్ సీఎండీ ఏ. గోపాలరావు సూచిస్తున్నారు.
⦁ వర్షాలు కురుస్తుస్న సమయంలో తడిసిన విద్యుత్ స్తంభాల సపోర్ట్ వైర్‌ను, తడిసిన విద్యుత్ ఉపకరణాలను తాకరాదు.
⦁ బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ వైర్లను కలుపరాదు.
⦁ ప్రజలందరూ విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, సర్వీస్ వైర్ల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. వాటిని తాకకుండా దూరంగా నడవాలి.
⦁ వోల్టేజ్లో హెచ్చు తగ్గులు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్ధం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి తప్ప.. మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించరాదు.
⦁ జోరుగా వర్షాలు పడుతున్న వేళ... వ్యవసాయ మోటార్ల దగ్గరకు వెళ్లడం, ఆన్ చేయడం చేయరాదు.
⦁ గృహాల్లో ఎలాంటి అతుకులు లేని సర్వీసు వైర్‌ను మాత్రమే ఉపయోగించాలని, తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా.. తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు.
⦁ విద్యుత్ మరమ్మతుల కోసం సంబంధిత విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి.
⦁ ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్‌కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్‌కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర, ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడాలి.
⦁ రైతులు వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని, పైపులు, ఫుట్ వాల్వులను తాకకూడదు.
⦁ వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయాలి.
⦁ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, కాలిన తీగలను సరిచేయడం వంటి పనులు అత్యంత ప్రమాదకరమైనవి.
⦁ మోటారు, పంపుసెట్లకు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వతహాగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం జరిగే అవకాశాలున్నాయన్నది మరిచిపోరాదు.
⦁ మోటారు రిపేరు కోసం తమ పరిధిలోని లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ తదితర విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించి వారి సేవలను పొందాలి.
ప్రాణం ఎంతో విలువైనది. నిర్లక్ష్యంతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు.
ఇదీ చదవండి: RAINS: దంచికొట్టిన వానలు.. పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు