Pravallika Last Rites Complete : ఓరుగల్లుకు చెందిన మరో విద్యాకుసుమం నేలరాలింది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండుకుండానే విద్యార్థిని ప్రవల్లిక (Pravallika) బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ అశోక్‌నగర్ హాస్టల్లో ఉంటున్న ప్రవల్లిక.. శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరుసగా పరీక్షల రద్దు, ఇటీవల గ్రూప్-2 వాయిదాతో తీవ్ర మనస్తాపానికి గురై.. ప్రాణాలు తీసుకున్నట్లు ఆమె స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. యువతి మృతితో మళ్లీ ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటంతో భారీగా మోహరించిన పోలీసులు.. ఉదయాన్నే అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామమైన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి (Bikkajipalli Village) తరలించారు. ప్రవల్లిక కడసారి చూపు కోసం గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Pravallika Funeral Ended in Bikkajipalli : విగతజీవిగా మారిన ప్రవల్లికను చూసి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు.. అక్కడి వారిని కంటతడిపెట్టించింది. పావుగంట ముందే తనతో ఫోన్‌లో మాట్లాడిన బిడ్డ.. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తమకు సమాచారం వచ్చిందని యువతి తండ్రి లింగయ్య కన్నీరుమున్నీరయ్యారు. విగతజీవిగా మారిన ప్రవల్లికను చూసి గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన కట్టలు తెగింది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల రోదనలతో ఆ ప్రాంతమంతా మార్మోమోగింది.
"శుక్రవారం రాత్రి నాకు ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. చివరికి తానే ఫోన్ చేసింది. పరీక్ష రద్దు అయిందని ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేసి చెప్పారు. అంత పదిహేను నిమిషాల్లోనే ఇలా జరిగిపోయింది." - లింగయ్య, ప్రవల్లిక తండ్రి
పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య.. విద్యార్థుల ఆందోళనతో అర్థరాత్రి ఉద్రిక్తత
వరంగల్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఓయూ జేఏసీ విద్యార్ధి సంఘ నాయకులు, ఇతర విద్యార్ధులు, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల నాయకులు.. ప్రవల్లికకు నివాళులలర్పించారు. అనంతరం యువతి కుటుంబానికి న్యాయం చేయాలని.. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. బిడ్డ బలవన్మరణం చెందిందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ప్రవల్లికకు కుటుంబసభ్యులు, గ్రామస్తుల సమక్షంలో అంతక్రియలు నిర్వహించారు. ఎన్నికల వేళ ప్రవళిక ఆత్మహత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఎలాంటి ఘటనలకు అవకాశం ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి మృతదేహాం తరలింపు.. అంత్యక్రియల వరకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.