రెక్కాడితే కానీ... డొక్కాడని నిరుపేదలకు... కరోనా కోలుకోలేని దెబ్బ కొడుతోంది. పొద్దంతా పనిచేస్తే గానీ పూట గడవని వారి బతుకులు రేపటి భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. చాలామందికి ఎండాకాలంలో చేతినిండా పని దొరికేది. సంవత్సరం మొత్తంలో వచ్చే ఆదాయం... మార్చి నుంచి మే నెలల్లోనే సంపాదించేవారు. అలాంటిది కరోనా వల్ల పనిలేక... చేతిలో డబ్బు లేకుండా అవస్థలు పడుతున్నారు.
కుండలు చేసేవారు, దర్జీలు ఆదాయం లేక అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్డు పక్కన చిల్లర దుకాణాలు, భోజన హోటల్, చిన్న చిన్న వస్తువులు విక్రయించి పొట్ట పోషించుకునే వారికి ఉపాధి కరువైంది. దుకాణాలన్నీ మూసేసి పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు.
లాక్‌డౌన్ ప్రభావంతో ఆటోలు ఇళ్లకే పరిమితమవడం వల్ల ఆటోవాలాలు ఇబ్బందులు పడుతున్నారు. తీసుకున్న అప్పులు, ఫైనాన్స్ ఎలా కట్టాలో తెలియక సతమతమవుతున్నారు. ఇవి ఇలా ఉంటే ఇంటి కిరాయిలు... గతంలో తీసుకున్న వడ్డీ రుణాలు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
డిమాండ్ ఉన్న నెలల్లోనే దమ్మిడి ఆదాయం లేకపోతే... భవిష్యత్ ఎలా గడుస్తుందో తెలియక చాలా మంది తల్లడిల్లుతున్నారు. రేషన్ కార్డు ద్వారా బియ్యం, రూ.1500 ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటున్నా... ఇతర ఖర్చులకు పైకం లేక అవస్థలు పడుతున్నారు.
ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది