ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్ర ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా సజావుగా సాగింది. 9 గంటల తరువాత... పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. మధ్యాహ్నం కాస్త తగ్గినా... తిరిగి మూడుగంటలకు మళ్లీ పట్టభద్రులు కేంద్రాలవైపు తరలివచ్చారు. 4 గంటల సమయం ముగిసినా... చాలా చోట్ల పోలింగ్ అదనంగా మరో గంటన్నర సేపు కొనసాగింది.
యువత, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంటిపిల్లలను సైతం చంకనెత్తుకుని ఓటింగ్‌కు వచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరులో పెదనాన్న చనిపోయినా విషాదంలో ఉండి కూడా వారి కుటుంబ సభ్యులు వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఓటేసిన ప్రముఖులు...
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి.. వేలేరు మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి... ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నర్సంపేటలో యువ తెలంగాణ అభ్యర్థిని రాణి రుద్రమ, మహబూబాబాద్‌లో వామపక్షాల అభ్యర్థి జయసారథి రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఇతర అధికారులు ఓటు వేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ వరంగల్‌లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్ల స్పందన బాగుందన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆందోళనలు...
తెరాస, భాజపా, వామపక్షాలు, కాంగ్రెస్‌ల మధ్య జిల్లా పలు చోట్ల వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నారు. మహబూబూబాద్ జిల్లా నెల్లికుదురు శివార్లలోని ఓ వేడుకల మందిరంలో తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ... భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, ఇతర నాయకులు అడ్డుకోవడానికి యత్నించగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహబూబూబాద్ ప్రధాన రహదారిపై భాజపా శ్రేణులు ఆందోళన నిర్వహించాయి.
ప్రలోభాలు!
పోలింగ్ కేంద్రాల ముందు తెరాస నాయకులు ప్రచారం చేస్తున్నా... పోలీసులు పట్టించుకోవట్లేదంటూ వామపక్ష కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తెరాస నాయకులు పట్టభద్రులను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ నర్సంపేటలో భాజపా నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. భూపాలపల్లిలోనూ తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలతో కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. రేగొండలో తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నా పట్టించుకోవట్లేదంటూ పోలింగ్ కేంద్రం వద్ద భాజపా రాష్ట్ర నాయకురాలు కీర్తిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఓటర్లకు ఎండ తగలకుండా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషనర్ చెప్పగా అప్పటికప్పుడు కేంద్రాల వద్ద టెంట్లు వేశారు. బూత్‌లు ఎక్కువ సంఖ్యలో లేకపోవడం, జంబో బ్యాలెట్ కావడం, క్యూలైన్లలో ఓటర్లు గంటల సేపు నిల్చోలేక ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: శశాంక్ గోయల్