మార్చి మొదటి వారంలో జరగాల్సిన వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికలు... వార్డుల పునర్విభజన కారణంగా ఏప్రిల్ రెండో పక్షంలో జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం వల్ల... ఆశావహులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా అధికార తెరాస నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన వారు, కొత్తగా ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలను తీవ్రం చేశారు. పార్టీ తరఫున పరిశీలకులుగా వచ్చిన నేతలు బాలమల్లు, బొంతు రామ్మోహన్‌లకు దరఖాస్తులిచ్చేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. కాగా... ఇప్పటికే పలు డివిజన్లలో పోటీచేసే అభ్యర్ధులపై స్పష్టత వచ్చినట్లు కూడా సమాచారం. తెరాసలో పోటీ ఎక్కువగా ఉన్నందున... అవకాశాలు రాని వారి సేవలను మరో విధంగా ఉపయోగించుకుంటామంటూ పార్టీ నేతలు ఆశావహులను సముదాయిస్తున్నారు.
రెండున్నరవేల కోట్లు
అభివృద్ధే ప్రధాన ఏజెండాగా ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే... ఇటీవల మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. నగరంలో రోజంతా విస్తృతంగా పర్యటించిన మంత్రి... రెండున్నరవేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు. కేటీఆర్ పర్యటనతో అటు నేతల్లో...ఇటు శ్రేణుల్లో జోష్ నింపింది. ఎలాగైనా గ్రేటర్ నగరిలో గులాబీ జెండా ఎగురేయాలని తెరాస పట్టుదలతో ఉంది.
వరుస కట్టిన నేతలు
కాగా... తెరాస అభివృద్ధి ప్రచారాన్ని భాజపా తిప్పికొడుతోంది. కేంద్ర నిధులతోనే వరంగల్ నగరాభివృద్ధి చెందిందని చెబుతూ వస్తున్న భాజాపా... ప్రభుత్వ వ్యతిరేకతతో ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది. రెండు నెలల ముందే ఓరుగల్లుకు వరుస కట్టిన భాజాపా నేతలు... అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ... కాషాయ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. అప్పట్లో ఎన్నికల ఊసు లేకపోవడంతో కమలదళంలో కొంత జోరు తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల నగారా మోగడంతో... మరోసారి పార్టీ సీనియర్ నేతలంతా వరంగల్ బాట పడుతున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా అభ్యర్ధుల ఎంపికను తుది దశకు తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. అభ్యర్ధుల నామినేషన్ల దాఖలు ముగిసిన తర్వాత చారిత్రక నగరిలో... ప్రచారాలు హోరెత్తనున్నాయి.
ఇదీ చూడండి: తొలిసారిగా జడ్చర్ల పురపాలికకు ఎన్నికలు