Corporator Vemula Srinivas was arrest: కొంత మంది వ్యక్తులు అధికార బలంతో ఏమి చేసిన అడిగేవారు ఏవరు లేరని అనుకొంటారేమో! అధికారం ఉందనే ధీమాతో కొంత మంది దోచుకోడానికి ప్రయత్నిస్తారు. మరికొంత మంది అభివృద్ధి పేరు చెప్పి దోచుకుంటారు. ఎక్కువగా భూకుంభకోణానికి పాల్పడతారు. అదే విధంగా వరంగల్ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భూకబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా జరిగిన భూ అక్రమణ పర్వంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌తో సహా ఐదుగురు అరెస్టయ్యారు.
కమిషనరేట్ పరిధిలో రెండు వేర్వేరు సంఘటనలో భూఅక్రమణలకు పాల్పడుతున్న 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాసతో సహ ఐదుగురిని హనుమకొండ, ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తప్పుడు పత్రాలతో భూఆక్రమణకు ఆయనతో పాటు డ్రైవర్ పడాల కుమారస్వామిని హనుమకొండ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం హనుమాన్ నగర్‌కు చెందిన నరాల సునీత సర్వే నంబర్ 44లో ఉన్న తన స్థలంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పరేషన్ నుంచి అనుమతి పొంది ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆ స్థలాన్ని అపార్ట్మెంట్ నిర్మాణం కోసం ఇవ్వాల్సిందిగా అదే ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, అతని కారు డ్రైవర్ పడాల కుమారస్వామి బాధితురాలతో పాటు ఆమె భర్త శ్రీనివాస్‌ను అడిగారు. దానికి వారు నిరాకరించారు.
స్థలాన్ని ఆక్రమణ చేయాలకున్న కార్పొరేటర్ తప్పుడు పత్రాలతో సర్వే నంబర్ 648 లోని స్థలం ఇదే అంటూ ఫిర్యాదిదారు స్థలంలోనికి అక్రమంగా ప్రవేశించారు. నిర్మాణ పనులు చేస్తున్నవారిని బెదిరించారు. ఆ స్థలానికి ఉన్న ప్రహరీ గోడను నేలమట్టం చేశారు. హద్దు రాళ్ళను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు నాలుగు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రాథమిక విచారణ అనంతరం సీపీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆయనతో పాటు అతని డ్రైవర్ పడాల కుమారస్వామిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కార్పొరేటర్‌కు తప్పుడు పత్రాలను సృష్టించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు నిందితులకు వైద్య పరీక్షలు చేశారు. ఆనంతరం ఖమ్మం జైలుకు తరలించారు.
మరో ఘటనలో దేశాయి పేటలోని సర్వే నంబర్ 90/బిలో భూమిని అక్రమణ చేసేందుకు యత్నించిన వరంగల్ నగరానికి చెందిన చిరంజీవిరావు, అశ్విన్ కుమార్, రమేష్‌లను ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో వున్నారు.
గతంలోనూ పలువురు కార్పొరేటర్ల పైన కబ్జాల ఆరోపణలు వచ్చాయి. కార్పొరేటర్ అరెస్ట్ కావడంతో జిల్లాలో సంచలనం రేపింది. ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతామని సీపీ ఏవి రంగనాథ్ తెలిపారు.
ఇవీ చదవండి: