PM Modi praises Mangtya Walya Tanda: మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ గురించి ప్రస్తావించారు. వరంగల్ జిల్లా మంగ్త్యావాల్య తండాలో చేపట్టిన ఓ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అమృత్ సరోవర్ అభియాన్‌లో భాగంగా కొత్తగా నీటికుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ ఈ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందన్నారు. మంగ్త్యావాల్య తండాలోనూ వర్షం నీటిని ఒడిసిపట్టేలా చేసిన పనుల గురించి ప్రజలతో పంచుకున్నారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో గ్రామస్థులు తీసుకున్న అద్భుతమైన చొరవ గురించి తెలిసింది. అక్కడ ఒక నూతన గ్రామ పంచాయితీని ఏర్పాటు చేశారు. ఆ గ్రామం పేరు మంగ్త్యావాల్య తండా. అటవీ ప్రాంతానికి సమీపంలో గ్రామం ఉంటుంది. ఈ గ్రామ సమీపంలో వర్షాకాలం నీరు నిల్వ ఉండేలా కుంటను నిర్మించారు. గ్రామస్థులు ప్రత్యేక చొరవ తీసుకొని అమృత్ సరోవర్ అభియాన్ పథకం ద్వారా అభివృద్ధి చేశారు. ఫలితంగా ఈ వానాకాలంలో భారీ వర్షాల కారణంగా కుంట నీటితో కళకళలాడుతోంది.-మోదీ, ప్రధానమంత్రి
PM Modi praises Mangtya Walya Tanda Amrit Sarovar : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని మంగ్త్యావాల్య తండాలో చెరువులు, కుంటలు లేకపోవడంతో వర్షపు నీరు వృథాగా పోతుంది. అమృత్ సరోవర్ అభియాన్ పథకం ద్వారా రూ.9.93 లక్షల ఉపాధి హామీ నిధులతో తండాలో నూతనంగా కుంటను తవ్వించారు. ప్రస్తుత వర్షాలకు కుంటలో నీరు చేరి భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో పథకం ప్రాముఖ్యతను, తండా వాసులు వినియోగించుకున్న తీరును ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. తమ తండా పేరు ఏకంగా ప్రధానమంత్రి నోట రావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి..: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపారన్న రాజ్‌నాథ్ సింగ్