భారీ వర్షాలు వరంగల్ నగర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఊరేదే.. ఏరేదో అర్థంకానీ పరిస్ధితిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రహదారులపై నిన్నటి వరకు వాహనాలు తిరిగితే.. నేడు వాటర్ బోట్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. నగర పరిధిలో దాదాపు 70 ప్రాంతాలు నీట మునగగా.. ఇంకా మూడొంతులకు పైగా కాలనీల చుట్టూ వరద నీరు నిలిచే ఉంది. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలు సైతం 2 మీటర్ల మేర నీటిలో మునిగి ఉన్నాయి. శివారు ప్రాంత కాలనీల్లో కనీసం కాలుపెట్టలేని పరిస్థితిలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖిలా వరంగల్ ప్రాంతంలో ఇల్లు కూలి వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు మరణించాడు.
పరిస్థితిని సమీక్షించిన అధికారులు..
ఈ నేపథ్యంలో నగర మేయర్, జిల్లా కలెక్టర్, కమిషనర్ ఇతర అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భాజపా అధ్యక్షులు బండి సంజయ్ సైతం వరద ప్రాంతాల్లో పర్యటించి.. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రంగంలోకి విపత్తు నిర్వహణ బృందాలు..
జాతీయ, నగర పాలక సంస్థ విపత్తు నిర్వహణ బృందాలు.. నగరంలో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాయి. అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని, ఇంట్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. రామన్నపేట ప్రాంతంలో నొప్పులతో బాధపడుతోన్న ఓ గర్భిణీని ఆసుపత్రికి తరలించగా.. మరోవైపు రెస్య్కూ బృందాలు, పోలీసులు సైతం సాయంగా నిలిచి.. బాధితులను ఆదుకుంటున్నారు.
ఆక్రమణల తొలగింపు..
నాలాల చుట్టూ ఆక్రమణలే వరద కష్టాలకు కారణం కాగా.. బల్దియా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నాలాల చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే భద్రకాళీ నాలా చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించారు.