వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాలయ ప్రిన్సిపల్ మృదుల అధిక ఫీజులు కట్టాలని తమను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నించిందుకు తమతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఫీజులు కట్టలేనప్పుడు వారిని ఎందుకు కన్నారని పిల్లల ముందే తీవ్ర పదజాలం వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధ్రువీకరణ పత్రం ఉన్నా..
2009 విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ జారీ చేసిన బీపీల్ ధ్రువీకరణ పత్రాన్ని సైతం ఆమోదించడం లేదని వాపోయారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి, ఒక్క కూతురు సంతానంగా ఉన్న వారికి ట్యూషన్ ఫీజులు కట్టకుండా మినహాయింపు ఉందని తల్లిదండ్రులు తెలిపారు. అయినప్పటికీ సంవత్సరానికి రూ.7,600 ఫీజు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇదేమని ప్రశ్నించిందుకు తమ పిల్లలను ఆన్లైన్ తరగతులు వినకుండా గ్రూప్ నుంచి తొలగించారని వెల్లడించారు.
విచారణకు కమిటీ..
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లోని కేంద్రీయ విద్యాలయ డివిజన్ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక కమీటీని కూడా విచారణకు వేశారని వారు తెలిపారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆన్లైన్ ద్వారా విచారణ ఉందని... వారితో తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ప్రిన్సిపల్ అనుమతించడం లేదని చెప్పారు. తల్లిదండ్రుల ఆందోళనకు దిగివచ్చిన ప్రిన్సిపల్.. చివరకు వారిని సమస్యలు చెప్పుకునేందుకు అనుమతించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రజాసేవకు అవకాశంగా భావించాలి: కేటీఆర్