Paddy procurement problems: వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అన్నదాతలకు తలనొప్పిగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరదాల భారం, లారీలు సకాలంలో అందుబాటులోకి రాకపోవడం, అంతకు మించి మిల్లుల సమస్య ఇలా విత్తు నుండి విపని వరకు అన్నదాతల కష్టం అంతా ఇంతా కాదు. నత్త నడకన సాగుతున్న కొనుగోళ్లతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి.
జిల్లాలో 196 కొనుగోలు కేంద్రాల ద్వారా 2లక్షల 35వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా ఇప్పటి వరకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చెసినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారులు తెలిపారు. వరి కోసి పది రోజులు నుంచి నెల రోజులు గడుస్తున్నా సకాలంలో కాంటాలు కాని పరిస్థితి కొనుగోలు కేంద్రాల్లో నెలకొంది. కొనుగోలు కేంద్రాలు ఉన్నా వాటికి అనుగుణంగా మిల్లులు లేని పరిస్థితి అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.
ప్రధానంగా వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో మిల్లుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో పరిశీలిన జరిపి ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచి మిల్లుల సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి.